దేశ రాజధాని నగరం ఢిల్లీలో సంభవించిన ఒక ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ఫ్లోరిష్ స్టే బి&బి (Flourish Stay B&B) హోటల్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 21 మంది సజీవదహనమవ్వగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించినా.. అక్కడ ఉన్న సామాన్య పౌరులే నిజమైన హీరోలుగా నిలిచారు. ఎలాంటి రక్షణ కవచాలు, పరికరాలు లేకపోయినా స్థానిక యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రంగంలోకి దూకి ఎంతోమంది బాధితులను కాపాడారు.
భవనాన్ని చుట్టుముట్టిన అగ్నికీలలు, నలుదిశలా దట్టంగా కమ్మేస్తున్న పొగ, లోపల చిక్కుకున్న వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా అత్యంత నిస్సహాయంగా మారిపోయింది. ఆ సమయంలో మంటల నుండి తప్పించుకోవడానికి కొందరు ఊపిరాడక హోటల్ కిటికీల నుండి కిందకు దూకడానికి ప్రయత్నించారు. ఈ భీకర వాతావరణాన్ని చూసి చలించిపోయిన స్థానిక యువకులు మహమ్మద్ అఫ్జల్, మౌలానా షాహరూఖ్, మౌలానా అనీష్, మౌలానా అమీర్, మౌలానా వసీం, మరియు రియాజవుద్దీన్ గద్దె వాలా మరికొందరు స్థానికులతో కలిసి తక్షణమే తాత్కాలిక సహాయక చర్యలు చేపట్టారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న మహమ్మద్ అఫ్జల్ ఆనాటి షాకింగ్ దృశ్యాలను వివరిస్తూ.. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి మంటలు తీవ్రంగా ఉన్నాయని తెలిపాడు. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి, హోటల్ కింద ఎదురుగా ఉన్న ‘అర్మాన్స్’ దుకాణం నుండి పెద్ద పెద్ద పరుపులను (Mattresses) తీసుకొచ్చి రోడ్డుపై పరిచారు. కిటికీల్లో చిక్కుకున్న బాధితులను ఆ పరుపులపైకి దూకమని గట్టిగా అరిచారు. అలా కొందరు సురక్షితంగా పరుపులపైకి దూకి ప్రాణాలు దక్కించుకోగా, మరికొందరు భయంతో దూకలేక లోపలే ఉండిపోయారు. పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే వారు హాజీ సాహిబ్ పోలీస్ స్టేషన్కు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.
చివరికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడంతో, ఈ స్థానిక యువకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా భవనంలోకి ప్రవేశించి లోపల చిక్కుకున్న మిగతా వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పరుపుల షాపు యజమాని చూపిన ఉదారతను అఫ్జల్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. తన సరుకు మొత్తం పాడైపోతుందని తెలిసినా, ప్రాణాలు కాపాడటం ముఖ్యమని ఆయన పరుపులు ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించలేదని చెప్పాడు. ఎలాంటి ప్రత్యేక రెస్క్యూ పరికరాలు లేకపోయినా, ఆ షాపులోని దుప్పట్లను తాళ్లుగా మార్చి పైఅంతస్తుల నుండి బాధితులను జాగ్రత్తగా కిందకు దించి, సొంత వాహనాల్లో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
