పశ్చిమాఫ్రికాలోని సహారా ఎడారి (Sahara Desert)లో అత్యంత హృదయవిదారకమైన ఉదంతం వెలుగుచూసింది. ఎడారి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోయింది. ఉష్ణోగ్రతల తీవ్రతకు తాగేందుకు చుక్క నీరు కూడా దొరక్క ఒకే కుటుంబానికి చెందిన 49 మంది వలసదారులు దాహార్తితో ప్రాణాలు విడిచారు. నైజర్ (Niger) దేశ పరిధిలోని అసమాకా సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ అంతర్జాతీయ విషాద ఉదంతాన్ని ఆఫ్రికా సరిహద్దు రక్షణ, వలసల నియంత్రణ అధికారులు అధికారికంగా ధృవీకరించారు.
నివేదికల ప్రకారం.. నైజర్ దేశానికి చెందిన ఒక పెద్ద బృందం తమ బంధువులతో కలిసి పండుగ వేడుకలు జరుపుకోవడానికి సరిహద్దు దాటి పక్కనే ఉన్న మాలి (Mali) దేశానికి ఒక ట్రక్కులో బయలుదేరి వెళ్లారు. అక్కడ వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా.. నైజర్ సరిహద్దు పట్టణమైన అసమాకాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన నిర్మానుష్య ఎడారి జోన్‌లో వారి ట్రక్కు ఇంజన్ చెడిపోయి ఆగిపోయింది. డ్రైవర్, ప్రయాణికులు ఎంత ప్రయత్నించినా వాహనం కదలలేదు. ఆ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ కానీ, ఎలాంటి రవాణా సౌకర్యాలు కానీ లేకపోవడంతో వారు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయి అక్కడే చిక్కుకుపోయారు.
రోజులు గడుస్తున్న కొద్దీ వారి వద్ద ఉన్న పరిమిత నీటి నిల్వలు, ఆహారం పూర్తిగా అయిపోయాయి. సహారా ఎడారిలో నమోదయ్యే విపరీతమైన ఉక్కపోత, వడగాల్పుల తీవ్రతకు ప్రయాణికులు ఒక్కొక్కరుగా తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై అల్లాడిపోయారు. చివరకు ప్రాణాల మీదకు రావడంతో ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఇసుక తిన్నెలపై కాలినడకన ప్రయాణించి.. ఎట్టకేలకు అసమాకా పట్టణానికి చేరుకుని స్థానిక అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన రెస్క్యూ టీమ్స్, మిలిటరీ దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునే సరికి.. ట్రక్కు లోపల, చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.
సాధారణంగా నైజర్-మాలి సరిహద్దుల్లోని ఈ ప్రమాదకరమైన ఎడారి రహదారుల గుండా పౌరులు ప్రయాణించడం చాలా అరుదని.. అయితే ఆఫ్రికా దేశాల నుండి యూరప్‌కు అక్రమంగా వలస వెళ్లే మానవ అక్రమ రవాణా ముఠాలు (Human Traffickers) మాత్రమే పోలీసుల కళ్లు గప్పి ఈ మార్గాన్ని వాడుతుంటాయని అధికారులు వెల్లడించారు. గతంలోనూ వందలాది మంది వలసదారులు ఇదే ప్రాంతంలో ఆకలి, దాహంతో అడ్రస్ లేకుండా ఇసుకలో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయని భద్రతా దళాలు గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను స్వాధీనం చేసుకున్న నైజర్ అంతర్గత భద్రతా విభాగం.. అసలు ఈ ట్రక్కు ఎడారిలో ఎన్ని రోజులు చిక్కుకుపోయింది, దీని వెనుక ఏవైనా వలస ముఠాల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించింది.
