టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. సూపర్ సిక్స్ హామీలతో ఉదరగొట్టిన చంద్రబాబు బ్యాచ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల సంగతే మర్చిపోయారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో దానిని వైసీపీ నేతలపై దాడులు, కేసులతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ని హామీలను విస్మరించిన చంద్రబాబు సర్కార్ పింఛన్ దారులకు చుక్కలు చూపిస్తోంది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అర్హులకు మొండిచేయే చూపింది చంద్రబాబు ప్రభుత్వం. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేదలు, వృద్ధులు, వితంతువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ల మొత్తాన్ని రూ. 4,000 కు పెంచినప్పటికీ, కొత్త పింఛన్ల ఊసేలేదు. ఇప్పటికే పెంచిన పింఛన్ల భారం రాష్ట్ర ఖజానాపై నెలకు వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా లక్షలాది మందికి పింఛన్లు మంజూరు చేస్తే ఆర్థిక వ్యవస్థ మరింత క్లిష్టంగా మారుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరైన పింఛన్లను తొలగించేందుకు ప్రభుత్వం అంతర్గతంగా సర్వే నిర్వహిస్తోందని, ఆ ప్రక్రియ ముగిసిన తర్వాతే కొత్త వారికి అవకాశం కల్పిస్తారని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వడపోత ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రభుత్వం మారితే మాకు పింఛన్ వస్తుందని ఆశపడ్డాం….. అన్ని అర్హతలు ఉండి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదుఅని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిధులు లేవనే సాకుతో పేదలను వంచించడం సరికాదని వైసీపీ నేతలు విమర్శించారు.అర్హులైన వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడింది. మరి దీనిపై కూటమి సర్కార్ ఇప్పటికైనా స్పందించి కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందా లేదా వేచిచూడాలి.
