ముంబయిలో విషాదం చోటుచేసుకుంది. ‘కుంకుమ భాగ్య’ సీరియల్ నటి సంచిత ఉగాలే (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నలసోపరాలో వెలుగుచూసింది. ముంబయిలోని అచోలే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నలసోపరాలో సంచిత తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఒక్కరే ఉన్నారు. తిరిగి వచ్చి చూడగా సంచిత ఉరివేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించారు. అదేవిధంగా ఆమెతో కలిసి పనిచేసిన సహ నటులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.
సంచిత ఉగాలే బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందారు. ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌లో దియా టాండన్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘వాగ్లేకి దునియా’, టీవీ డ్రామా ‘దిల్‌వాలీ దుల్హా లే జాయేగి’ వంటి ధారావాహికల్లోనూ నటించి మెప్పించారు. సంచిత ఆకస్మిక మరణంతో బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది.
