మలయాళ నటుడు షేన్ నిగమ్ నటించిన ‘భూతకాలం’, ‘దృఢం’ చిత్రాల కథలు తనవేనని కేరళకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ కౌన్సిలర్ ఆర్.శ్రీలేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ‘దృఢం’ దర్శకుడు మార్టిన్ జోసెఫ్ ఖండించారు.
షేన్ నిగమ్ నటించిన ‘భూతకాలం’, ‘దృఢం’ సినిమాలు తన కథల ఆధారంగానే రూపొందాయని ఆర్.శ్రీలేఖ ఫేస్బుక్ వేదికగా పేర్కొన్నారు. తాను రాసిన ‘భూత భవనం’ కథను ‘భూతకాలం’గా తీశారని, అలాగే తాను మాతృభూమి వారపత్రికలో ‘కరింకుడి పోలీస్స్టేషన్’ పేరుతో రాసిన కథనే ‘దృఢం’గా తెరకెక్కించారని ఆమె ఆరోపించారు. ఈ కథను తన యూట్యూబ్ ఛానల్లో ఆడియో రూపంలో కూడా అందుబాటులో ఉంచానని ఆమె తెలిపారు. షేన్ నిగమ్ నటన అంటే తనకు ఇష్టమని, కానీ తన అనుమతి లేకుండా కథలను వాడుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
శ్రీలేఖ ఆరోపణలను ‘దృఢం’ దర్శకుడు మార్టిన్ జోసెఫ్ తోసిపుచ్చారు. ఆమె వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. “సినిమా చూస్తే ఆమె రాసిన కథతో దీనికి సంబంధం లేదని స్పష్టమవుతుంది. ఈ విషయంపై మా స్క్రీన్ప్లే రైటర్లతో మాట్లాడాను. వారు ఇప్పటికే ఆమె వీడియోను చూశారు. ఒకసారి వీడియో చూశాక, మళ్ళీ అదే కథను తీసుకునే అవకాశం లేదు కదా” అని మార్టిన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘దృఢం’ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుండగా, రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వచ్చిన ‘భూతకాలం’ సోనీలివ్లో అందుబాటులో ఉంది. ‘భూతకాలం’ చిత్రం ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా గెలుచుకోవడం గమనార్హం.
