కూటమి సర్కార్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు స్వయం సహాయక సంఘాల (SHG – డ్వాక్రా మహిళల) రుణ వృద్ధి అత్యంత కీలకమైనది. రుణాల పెరుగుదల అనేది ఉత్పాదక పెట్టుబడులను సూచిస్తుంది, ఇది మహిళల ఆదాయ ఉపాధి మార్గాలను బలపరుస్తూ వారి స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పారు.
అయితే రుణ వృద్ధి రేటు పడిపోవడం అనేది తక్కువ పెట్టుబడులను, తద్వారా తక్కువ ఆదాయాలను, ఫలితంగా తక్కువ వినియోగాన్ని సూచిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు స్పష్టమైన నిదర్శనం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి వృద్ధి రేటు మైనస్ 3.22% (-3.22%) గా నమోదు కావడం కూడా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది అన్నారు.
డ్వాక్రా మహిళల రుణ వృద్ధిని ప్రోత్సహించడంలో రుణాలపై ఇచ్చే వడ్డీ సబ్సిడీ (వడ్డీ రీఇంబర్స్‌మెంట్) అత్యంత కీలకం. 2019-24 మధ్య కాలంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కేవలం వడ్డీ సబ్సిడీ ద్వారానే పొదుపు సంఘాల రంగానికి నేరుగా రూ. 4,969 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందించింది. దీనికి తోడు ‘ఆసరా’, ‘చేయూత’ వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా మహిళలు స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడేలా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది అన్నారు.
ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన కూటమి తమ మేనిఫెస్టోలో ఒక కీలకమైన వాగ్దానం చేసింది. ‘స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ సబ్సిడీ వర్తించే రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతాం అని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎప్పటిలాగే టీడీపీ కూటమి ప్రజలకు మొండిచేయి చూపిస్తూ ఆ మాటను గాలికొదిలేసింది. పెంచిన రుణ పరిమితిపై వడ్డీ సబ్సిడీ ఇవ్వడం పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న పథకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపులు – వాస్తవాలు:
2024-25 ఆర్థిక సంవత్సరం: వడ్డీ సబ్సిడీ కింద విడుదల చేసిన నిధులు ‘సున్నా’ (Zero).
2025-26 ఆర్థిక సంవత్సరం: బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించినా, విడుదల చేసింది మాత్రం ‘సున్నా’.
2026-27 ఆర్థిక సంవత్సరం: ఈ ఏడాది బడ్జెట్‌లో మళ్లీ రూ. 100 కోట్లు కేటాయించారు, కానీ విడుదలయ్యేది మళ్లీ ‘సున్నా’ కాబోతోంది.ప్రతి డ్వాక్రా గ్రూపుకు సగటున రూ. 6,00,000 అప్పు ఉందని ఊహించుకున్నా… టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 3,000 కోట్ల వడ్డీ సబ్సిడీ అందాలి. అంటే, ఈ కూటమి ప్రభుత్వ మొదటి రెండేళ్ల పాలనలోనే మహిళా లబ్ధిదారులు దాదాపు రూ. 6,000 కోట్ల మేర ఆర్థిక లబ్ధిని కోల్పోయి మోసపోయారు అన్నారు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్యల వల్ల 2019-24 మధ్య డ్వాక్రా సంఘాల రుణ వృద్ధి ఎంతో ఆరోగ్యకరంగా సాగింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు మద్దతు కరువవడం వల్ల రుణాల జారీ ఘోరంగా పడిపోయింది అన్నారు.
డ్వాక్రా రుణాల పతనం ఇలా ఉంది అని లెక్కలతో సహా చూపించారు జగన్. 2023-24 (YSRCP పాలన ముగింపు నాటికి): రూ. 49,696 కోట్లు కాగా 2024-25 (కూటమి ప్రభుత్వం): రూ. 41,623 కోట్లకు పతనం అయిందన్నారు. 2025-26 (కూటమి ప్రభుత్వం): మరింత దిగజారి రూ. 41,105 కోట్లకు చేరింది అని… మహిళా సాధికారతను అట్టడుగుకు నెట్టేస్తూ, మహిళలకు ఇచ్చిన మరో నమ్మకమైన వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం ఎలా భంగపరిచిందో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి అని దుయ్యబట్టారు జగన్.
