తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో టీటీడీ ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి టీటీడీ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాల ముహూర్తం.. రోజు వారీ సేవలతో పాటుగా తిరుమలకు ఆ సమయంలో వచ్చే భక్తులకు కీలక సూచనలు చేసారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహణ కు టీటీడీ నిర్ణయించింది. సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆ తరువాత రోజు 15న ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఇక, మరుసటి రోజు నుంచి నిత్యం వాహన సేవ లు నిర్వహించనున్నారు. 19-09-2026 గరుడ వాహనం, 22-09-2026 రథోత్సవం.. అదే విధంగా 23-09-2026 చక్రస్నానం ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. అయితే, బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
అదే విధంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేసారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్దేశించారు శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా.. గరుడసేవకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 18-09-2026 రాత్రి 9 నుండి 20-09-2026 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
