తిరుమలలో భక్తులకు అందించే శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదం సహా అన్ని ఆహార పదార్థాల నాణ్యత, భద్రత, పోషక విలువలను మరింత మెరుగుపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మైసూరుకు చెందిన *సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షలు, పంపిణీ ప్రక్రియల్లో శాస్త్రీయ విధానాలను అమలు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ, ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రసాదాల నాణ్యతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
టీటీడీ-సీఎఫ్‌టీఆర్‌ఐ సంయుక్త బృందాలు ముడి పదార్థాల కొనుగోలు నుంచి భక్తులకు ప్రసాదాల పంపిణీ వరకు కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు రూపొందించనున్నాయి. నిల్వ వ్యవస్థలు, పరీక్షా విధానాలు, సరఫరా వ్యవస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి కలుషితానికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టనున్నారు.
అంతేకాకుండా, శ్రీవారి ప్రసాదాల అసలు రుచి, సాంప్రదాయ విలువలు దెబ్బతినకుండా వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్యాకేజింగ్ విధానాలపై కూడా పరిశోధనలు నిర్వహించనున్నారు. నెయ్యి స్వచ్ఛత, ఆహార భద్రత, నాణ్యత పరీక్షలపై టీటీడీ సిబ్బందికి సీఎఫ్‌టీఆర్‌ఐ శిక్షణ అందించనుంది.ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ప్రసాదాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు పలుమార్లు స్పష్టం చేశారు.
దేశంలోని ఆలయ రంగంలో ఈ తరహా శాస్త్రీయ భాగస్వామ్యం అరుదైనదిగా భావిస్తున్న అధికారులు, భవిష్యత్తులో శ్రీవారి ప్రసాదాల నాణ్యతను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
