- Advertisement -

తిరుమలలో భక్తులకు గదుల కేటాయింపు విధానంలో కీలక మార్పులు..

- Advertisement -

తిరుమలలో భక్తులకు వసతి ఏర్పాటు విషయంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. సామాన్య భక్తులకు వసతి గదుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టే విధంగా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నిరీక్షణ అవసరం లేకుండా త్వరగా కేటాయింపులు చేసేలా సాంకేతికత వినియోగిస్తోంది. ఉప విచారణ కార్యాలయాల ద్వారా భక్తులకు వేగంగా గదులను కేటాయించేలా కొత్త నిబంధనలు ఖరారు చేసింది.

టీటీడీ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం వసతి గది కావాలనుకునే భక్తులు ముందుగా తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి గదులు అందుబాటులో ఉన్నంత వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. భక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌ను అక్కడి కౌంటర్‌లో అందించాలి. అనంతరం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వారి వివరాలను నమోదు చేసుకుంటారు. ఈ సమయంలో భక్తులు తమకు కావాల్సిన గది కేటగిరీని ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, రిజిస్ట్రేషన్ విజయవంతమైనట్లు నిర్ధారిస్తూ భక్తులకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత భక్తులు సీఆర్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్ ప్లే బోర్డులను గమనిస్తూ ఉండాలి.

రిజిస్ట్రేషన్ క్రమ సంఖ్యల వారీగా గదులు కేటాయించబడుతున్న సమాచారం ఈ బోర్డులపై కనిపిస్తుంది. తమ రిజిస్ట్రేషన్ నంబర్ డిస్ ప్లే అయిన 15 నిమిషాల్లోపే, వారు నమోదు చేసిన ఫోన్ నంబర్‌కు గది కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ లేదా కియోస్క్ ద్వారా సమాచారం అందిన తర్వాత, భక్తులు నేరుగా తమకు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ గది అద్దె రుసుమును ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే చెల్లించాలి. నగదు చెల్లింపులకు అవకాశం లేదు. రుసుము చెల్లించిన వెంటనే వారికి గది తాళాలు అందజేస్తారు. గది పొందడానికి భక్తుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒంటరి వ్యక్తులకు, అవివాహితులకు గదులు కేటాయించరు. ఒకసారి గది పొందిన వ్యక్తి, తిరిగి 30 రోజుల వరకు మరో గదిని పొందే అవకాశం ఉండదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -