నితేశ్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. దిల్లీ శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర బృందానికి ఒక లేఖ రాస్తూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లలో విడుదలకు ముందే ఆ చిత్రాన్ని తమకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించాలని, లేనిపక్షంలో భారీ నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
హిందూ మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉండకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ లేఖ రాస్తున్నట్లు అర్జున్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లను పరిశీలించిన తర్వాత కొన్ని విషయాల్లో తమకు తీవ్ర అసంతృప్తి కలిగిందని ఆయన వెల్లడించారు. తాము ఈ సినిమాను పూర్తిగా స్వాగతిస్తున్నామని, లక్షలాది మంది ప్రజలు దీనిని వీక్షించాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే, ట్రైలర్‌లోని కొన్ని భావోద్వేగాలు సరిగ్గా లేవని, అలాగే కొన్ని సన్నివేశాల్లో నటీనటుల కాస్ట్యూమ్స్ కూడా ఆమోదయోగ్యంగా లేవని ఆయన పేర్కొన్నారు. గతంలో ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో తలెత్తిన తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకునే తాము ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
సినిమాలో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉండే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని, అందుకే విడుదలకు ముందే స్క్రీనింగ్ నిర్వహించి వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ చిత్ర బృందం తమ అభ్యర్థనను పట్టించుకోకుండా, సినిమాలో అభ్యంతరకర అంశాలను కొనసాగిస్తే థియేటర్లలో ప్రత్యక్ష నిరసనలు చేపడుతామని అర్జున్ కుమార్ హెచ్చరించారు.
నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ బహుభాషా చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించగా, సీతాదేవి పాత్రలో సాయిపల్లవి నటించారు. అలాగే రావణుడి పాత్రలో ప్రముఖ నటుడు యశ్ నటిస్తూ, నమిత్ మల్హోత్రాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ‘రామాయణ: పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
