- Advertisement -

కొనసాగుతున్న ఉత్కంఠ.. కేబినెట్ విస్తరణా? ప్రక్షాళనా?

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ మార్పులు, చేర్పులపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి దిల్లీకి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆయన మరో విడత చర్చలు జరపనున్నారు. ఈ పరిణామాలతో కేబినెట్ విస్తరణ జరుగుతుందా? లేక శాఖల మార్పు ఉంటుందా? లేదా పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అటు ప్రస్తుత మంత్రులు, ఇటు ఆశావహులు తీవ్ర టెన్షన్‌లో ఉన్నారు.

కొండా సురేఖ బర్తరఫ్ ఎపిసోడ్‌తో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాలపై ‘మూడ్‌ ఆఫ్‌ ఎమ్మెల్యేల’ నివేదికను తెప్పించాలని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. మంత్రివర్గంలో ఖాళీ అయిన స్థానాలతో పాటు కొత్తగా మరికొందరికి అవకాశం కల్పించే అంశంపై కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా సురేఖ స్థానంలో మళ్లీ మహిళా నాయకురాలికే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పలువురు సీనియర్ మహిళా ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కొంతమంది మంత్రుల శాఖలను మార్చడంతో పాటు, పనితీరు బాగోలేని మరికొందరిని కూడా తప్పించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దిల్లీ పర్యటనలో భాగంగా అధిష్ఠాన పెద్దలతో సీఎం రేవంత్ ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సొంతూరిలో రెండు రోజుల పర్యటన ముగిసిన తర్వాత, సీనియర్ మంత్రులతో కలిసి ఆయన మళ్లీ దిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏ మంత్రులకు ఉద్వాసన పలకనున్నారు? ఎవరి శాఖలు మారనున్నాయి? అనే టెన్షన్ పార్టీ వర్గాల్లో నెలకొంది.

మంత్రి పదవుల కోసం ఆశావహ ఎమ్మెల్యేలు లాబీయింగ్ ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం భావిస్తోంది. కేబినెట్‌లో ఖాళీల భర్తీతో పాటు సమూల ప్రక్షాళన ఉంటుందా అనేదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -