జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో వసతి సదుపాయాలు, క్రికెట్ పిచ్ నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెటర్ల కోసం చాలా చిన్న గదులను సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో తమ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా వేరే వసతి ఏర్పాటు చేయాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ అభ్యర్థనను భారత ఒలింపిక్ సంఘం (IOA) తిరస్కరించినట్లు తెలుస్తోంది. క్రీడాకారులందరికీ నిబంధనలు ఒకేలా ఉంటాయని ఐవోఏ స్పష్టం చేసింది.
ప్రత్యేకంగా ఎవరికీ వేరే వసతి కల్పించడం కుదరదని ఐవోఏ తేల్చిచెప్పింది. అయితే సొంతంగా క్రికెటర్లకు వసతి ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు మాత్రం బీసీసీఐకి ఉందని ఐవోఏ సీఈవో రఘురామ్ అయ్యర్ స్పష్టం చేశారు. క్రీడాకారుల వసతి ఏర్పాట్లపై బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ నిరంతరం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. జపాన్‌లోని సదుపాయాలను అంచనా వేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని పంపాలని క్రికెట్ బోర్డు భావించిందని, ఐవోఏ కూడా అందుకు అంగీకరించిందని చెప్పారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆర్గనైజర్లు కల్పించిన సదుపాయాలను వాడుకుంటారా? లేక సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటారా? అనేది బీసీసీఐ ఇష్టమని స్పష్టం చేశారు.
ఆసియా గేమ్స్ ఆర్గనైజర్లు భారత పురుషుల జట్టు కోసం త్రీ-స్టార్ హోటల్‌ను కేటాయించారు. అలాగే మహిళా క్రికెటర్ల కోసం ఫోర్-స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ హోటళ్లలో ఒక్కో గదిని ఇద్దరు ప్లేయర్లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా భారత మహిళా జట్టు జపాన్‌కు పయనం కానుంది. సెప్టెంబర్ 17 నుంచే వారి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
అక్కడ కల్పించిన వసతి, ఇతర సదుపాయాలను పరిశీలించేందుకు వచ్చే వారంలో ఒక ప్రత్యేక కమిటీ జపాన్‌కు వెళ్లనుంది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ అక్కడి హోటళ్లు నచ్చకపోతే బీసీసీఐ సొంత ఖర్చుతో ఆటగాళ్లకు వేరే చోట వసతి కల్పించే అవకాశాలున్నాయి.
