ఏపీ మంత్రి యనమల వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఎంతో బాధ్యతతో రైతుల సమస్యలు ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లానని ట్వీట్స్ చేశారు.
విజ్ఞతతో స్పందించడం మానేసి రైతుల ఆవేదనను వెటకారం చేయడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు.
కట్టేది స్వర్గమని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా లేదా సాధారణ స్వర్గమా అనేది తర్వాత ఆలోచించవచ్చని పవన్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. రాజధానిలో భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్, విశాఖ కొండల్లో తమకు ఎలాంటి స్టూడియోలు లేవని పవన్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో సినీపరిశ్రమకు ఇచ్చింది మూడు పంటలు పండే భూములు కాదని, కొండలు గుట్టలు మాత్రమేనని పవన్ చెప్పారు. యనమల ఈ విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. చేయాల్సిన పనిని చిత్తశుద్దితో చేయాల్సింది మాని వెటకారం చేస్తున్నారని తెలిపారు.
త్వరలో బేతపూడి, ఉండవల్లి గ్రామాల్లోని రైతులను కలుస్తానని పవన్ చెప్పారు. నదీపరివాహక ప్రాంత రైతులను కలుస్తానని పవన్ ట్విటర్‌లో తెలిపారు. రైతుల సమస్యలను బాధ్యతతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని ట్వీట్ చేశారు. ప్రజలపై బలవంతపు చర్యలు మానుకోవాలని పవన్ హితవు పలికారు.
