వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పై వైసీపీ పార్టీ తేల్చి చెప్పింది.. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని వైసీపీ అధినేత జగన్‌కు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే న్యూస్ ను ప్రశాంత్ కిషోర్ టీమ్ ఖండించింది. జనసేనతో వైసీపీ పొత్తు పెట్టుకునే చాన్స్ ఉందని కొన్ని టీవీ ఛానల్స్ చెప్పాయి.
కానీ అవన్ని అబద్దాలే అని వైసీపీ కొట్టి పారేసింది. ఇంకో ఆసక్తికర న్యూస్ ఆంగ్ల మీడియాలో వచ్చింది. 2019 ఎన్నికల్లో కలిసి ముందుకు సాగుదామని, అయితే పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జనసేన వైసిపి అధినేతకు చెప్పిందని ప్రచారం సాగుతోందని రాసింది. 2019లో గెలిస్తే జగన్ ముఖ్యమంత్రి పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు జనసేన ఎమ్మెల్యేలకు కొందరికి మంత్రి పదవులు కేటాయించాలని కూడా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నట్లు పేర్కొంది. అయితే నేరుగా పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అని కాకుండా, జనసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లుగా వార్తలు వచ్చాయని పేర్కొంది. ఇందుకు జగన్ అంగీకరించారని తెలిసిందని పేర్కొంది. పవన్, జగన్ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు 2019లో దీనినే ప్రత్యేక ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తున్నాయని కూడా తెలుస్తోందని ప్రచారం సాగుతోంది. ఇద్దరు కలిస్తే ప్రత్యేక హోదా గురించి బిజెపి, టిడిపిలను పని పట్టవచ్చు అని.. ఈ క్రమంలో వారిద్దరు కలయిక బాగుంటుందని అంటున్నారు.
అయితే ఇప్పుడు వైసీపీ ప్రకటనతో అవన్నీ కేవలం ఊహాగాన వార్తలేనని తేలిందని అంటున్నారు. జనసేనతో వైసిపి కలుస్తుందని, ఆ పార్టీ పలు డిమాండ్లు ముందు పెట్టిందనే ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్‌తో పాటు వైసిపి నేతలు కూడా ఖండించారు. తన అధినేత వైఎస్ జగన్ కు జనసేనతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన లేదని.. జనసేనతోనే కాదు.. ఇతర ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని వైసిపి నేతలు అంటున్నారు. ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని.. ఇప్పుడు దానికి గురించి మాట్లాడే అవసరం లేదని చెబుతున్నారు.
