వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వరలక్ష్మిపై దర్శకుడు సంజీవ్ చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. వరలక్ష్మి సినిమా ఈవెంట్లకు సరిగ్గా రాలేదని, డబ్బులు తీసుకుని కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందంటూ ఆయన ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. తాజాగా ఈ వివాదంపై వరలక్ష్మి శరత్‌కుమార్ స్పందిస్తూ దర్శకుడి ఆరోపణలకు గట్టిగానే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
తాను సినిమాకు సంబంధించిన కార్యక్రమాలకు వెళ్లానని చెప్తూ ఈ అనవసర వివాదాన్ని మరింత పెద్దది చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని వరలక్ష్మి స్పష్టం చేశారు. “చిత్ర యూనిట్‌కు నా అవసరం ఉన్నప్పుడల్లా నేను అందుబాటులోనే ఉన్నాను. సినిమాకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన ప్రోగ్రామ్‌కు హాజరయ్యాను. తాజాగా జరిగిన వేడుకలో దర్శకుడు నాపై ఏం మాట్లాడారో నాకు ఎవరూ పూర్తిగా చెప్పలేదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు, పద్ధతులు ఉంటాయి. అందుకే చిత్రబృందం చేస్తున్న ఈ ఆరోపణల గురించి నలుగురిలో బహిరంగంగా చర్చించాలని నేను అనుకోవడం లేదు,” అని వరలక్ష్మి తేల్చి చెప్పారు.
తాను అందరిలాగా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేనని.. తన పని తాను చూసుకుంటూ సైలెంట్‌గా వెళ్లిపోతానని వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ ఖాతాలో ఒక నోట్ షేర్ చేశారు. అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. వరలక్ష్మి ప్రమోషన్స్‌కు అస్సలు సహకరించలేదని, ఆమె వల్లే సినిమాకు భారీ నష్టం వాటిల్లిందని, డబ్బింగ్ చెప్పే సమయంలోనూ తమను చాలా ఇబ్బంది పెట్టిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పడుతుందో లేదో చూడాలి.
