నవరాత్రులు పూజలందుకున్న బొజ్జగణపయ్యలు జలప్రవేశానికి సిద్ధమవుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి.
ఇన్నాళ్లూ భక్తులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెట్టిన ఉండ్రాళ్లు ఆరగించిన ఏకదంతుడు చల్లంగ ఉండండంటూ దీవెనలందించాడు. ఇక నిమజ్జనానికి సమయం ఆసన్నమవుతుండడంతో
పోలీసులు, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో నిమజ్జనోత్సవానికి పోలీసులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 23వేల మందితో పోలీసులను మోహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను మళ్లిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఉదయం బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం తర్వాత నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాలాపూర్ గణనాథుడు తరలిన తర్వాతే మిగతా వినాయకులు జలప్రవేశానికి తరలివెళ్తారు. దీంతో రూట్ మ్యాప్ రెడీ చేసిన అధికారులు పోలీసులను మోహరిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
