ప్రజల తరపున పోరాడుతూ రాజకీయాలు చేస్తే ఏమొస్తుంది? అధికారంలో ఉన్నవాళ్ళ ఆగ్రహానికి గురికావడం తప్ప. ఇక భజన మీడియా బలం కూడా పుష్కళంగా ఉన్నవాళ్ళకు ఎదురెళితే విషపురాతలతో అభూతకల్పనల కథలో వ్యక్తిత్వ హననం ఓ స్థాయిలో చేసేస్తారు. అధికారంలో ఉన్న సోనియాకు ఎదురుతిరగబట్టే జగన్‌పై కేసులు పెట్టారని ఆ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా స్వయంగా సెలవిచ్చారు. ఇక ‘జెండా పీకేద్దాం’ అని చెప్పి విషపు రాతలతో చిరంజీవిని పద్మవ్యూహంలో ఇరికించి పొలిటికల్ కమెడియన్‌ని చేసిన వైనాన్ని కూడా పవన్ స్వయంగా చూసి ఉన్నాడాయే.
అందుకే ఎంచక్కా పవన్ ఒక బ్రహ్మాండమైన రాజకీయ విధానానికి తెర తీశాడు. మీడియా బలం గట్టిగా ఉండడంతో పాటు ….ఎన్టీఆర్ లాంటి వాళ్ళనే వెన్నుపోటు రాజకీయాలతో పూర్తిగా అణగదొక్కిన చంద్రబాబుకు జై కొట్టాడు. బాబు బ్యాచ్‌తో పాటు ఆయన భజన మీడియాలో కూడా బోలెడంత భజన తనకూ దక్కేలా చేసుకున్నాడు. ప్రజలకు కనపడని తెరవెనుక ప్యాకేజీలకు ఎలాగూ ఢోకా ఉండదని చెప్పి పవన్ ఎంచుకున్న వ్యూహం రాజకీయ మేధావులను కూడా షాక్‌కి గురిచేసింది.
చంద్రబాబుతో బంధం తాలూకూ ఫలాలు అనుభవిస్తున్న పవన్ ఇప్పుడు తెలంగాణాలో కెసీఆర్‌తో కూడా అదే రకం బంధానికి ప్లాన్స్ చేసుకున్నాడు. కొత్త స్వాతంత్ర్యం రోజు స్వయంగా కెసీఆర్ ఇంటికి వెళ్ళి……కెసీఆర్‌తో గంటన్నర సేపు భేటీ వేశాడు. పరస్పర ప్రయోజనాల విషయంలో ఇద్దరి మధ్యా ప్యాకేజ్ సెట్టయిందన్న విషయం బయటికి వచ్చాక పవన్ మాట్లాడిన మాటల్లోనూ, ఆయన మొహంలో కనిపించిన ఆనందంలోనూ చాలా స్పష్టంగా కనిపించింది. కెసీఆర్ పాలనను వేనోళ్ళ పొగిడేశాడు పవన్ కళ్యాణ్. ఇక అజ్ఙాతవాసి సినిమా రిలీజ్ అయిన వెంటనేనో, లేకపోతే రిలీజ్‌కి కాస్త ముందుగానో తెలంగాణాలో కూడా పవన్ టూర్ ఖాయం. ఆ టూర్‌కి అధికార పార్టీలతో అంటకాగుతున్న మీడియా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ టూర్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి జగన్‌ని, ఎప్పుడో చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించినట్టుగానే…… తెలంగాణాలో కూడా అధికారంలో ఉన్న కెసీఆర్‌ని వదిలేసి కాంగ్రెస్, బిజెపి పార్టీలను పిచ్చి తిట్లు తిట్టడం ఖాయం.
శభాష్…….బాగుంది. పవన్ కళ్యాణ్ రాజకీయం ఆయనకు సుఖంగానే ఉంది. జనసేన పెట్టిన తర్వాత సినిమాల విషయంలో కూడా స్పీడ్ పెంచాడు పవన్. గత రెండేళ్ళలో ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్‌ల కంటే ఎక్కువ సినిమాలు చేశాడు పవన్ కళ్యాణ్. ఫోర్బ్స్ లిస్టులో కూడా పవన్ సంపాదన ప్రముఖ స్థానమే సంపాదించుకుంది. ఒరిజినల్ సంపాదన అంతకు ఐదింతలు ఎక్కువే ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలతో ‘కమిట్మెంట్’ పక్కా అయింది కాబట్టి ఆ రకంగా కూడా అన్నీ ప్రయోజనాలే. ఆ రకంగా పవన్ వరకూ చూసుకుంటే ఇదే భేషైన, అత్యంత లాభదాయకమైన రాజకీయమే.
కాకపోతే ప్రజల బాధలు చూడలేక చలించిపోతుంటాను, విభజన సమయంలో పదిహేను రోజులు ఆహారం మానేశాను, సీమాంధ్రులను అవమానించాడని చెప్పి……..‘ఏయ్…కెసీఆర్…..నీ తాట తీస్తా….’ అని ఆ మధ్య ప్రచార స్టంట్స్ చేయడం, నీతి నిజాయితీ, మాట కోసం నిలబడతా, అవినీతిని రూపుమాపుతా, విలువలు, వంకాయ అంటూ ప్రజల కోసం ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వకుండా ఉంటే ఆక్షేపించాల్సింది కూడా ఏమీ లేదు. ఆఫ్టరాల్ పవన్ కూడా మనిషేగా. పైగా ఆయనకు భరణం ఖర్చులు, పిల్లల ఖర్చులు గట్టిగా ఉంటాయాయే. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు కూడా గతంలో చాలా డబ్బులు పోగొట్టుకున్నాను, నా సినిమాలకు డబ్బులు రాలేదు అని వాపోతూ ఉంటాడు పవన్. అందుకే ఇప్పుడు తెలివితేటలు తెచ్చుకుని డబ్బు సంపాదించుకోవడంలో ఆ రకంగా ముందుకు పోతున్నాడన్నమాట. శభాష్ పవన్.
