జాతీయ రాజకీయాల్లోకి వస్తూ.. రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ అధినేత కేసీఆర్ అందుకనుగుణంగా దూసుకెళ్తున్నారు. తాను అనుకున్న అజెండాతో కేసీఆర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలో దళితుల ఆందోళన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఆ తర్వాత జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు.. వార్తల నిషేధం తదితర వాటిపై కేసీఆర్ స్పందించారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీల చట్టం విషయంలో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఆ వర్గాలు ఆందోళన చేపట్టడంతో దళితులపై వివిధ రాష్ర్టాలలో జరిగిన దాడులను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు ప్రభుత్వం, సమాజం అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గుర్తు చేశారు.
‘అణచివేతకు గురైన దళితులకు అండగా ఉండేందుకే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. భారత ప్రభుత్వం కూడా వారి రక్షణ కోసం చట్టాలు చేసింది. వారి హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. న్యాయస్థానం మార్గదర్శకాలపై వెంటనే కేంద్రం స్పందించాలి. దళితుల వెంట ఉన్నామనే భరోసా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కనీస కర్తవ్యం. ఎస్సీ,ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం అమలు విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు దళితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనే విషయాన్ని ప్రధాని న్యాయస్థానానికి చెప్పాలి. తమ హక్కులు, చట్టాలకు భంగం కలుగుతుందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలి’ అని కేసీఆర్ కోరారు.
అక్రిడిటేషన్ రద్దు నిర్ణయం సరికాదు
తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడిటేషన్ రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వేల మంది జర్నలిస్టులకు ఈ నిర్ణయం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.
