ఓదార్పుయాత్రకు అంగీకరించలేదని, సోనియాతో విబేధించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశాక వైఎస్ జగన్ ఆ పార్టీని టార్గెట్ చేశారు. ఓదార్పుయాత్రలో సోనియాను, కాంగ్రెస్ నేతలను తిట్టిన తిట్టకుండా తిట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ఇటలీ అహంకారానికి పోరాటమన్నారు. తన తండ్రి, వైయస్ రాజశేఖర‌్ రెడ్డి పింఛన్లు, పావలావడ్డీ, ఫీజుల రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పదేపదే చెప్పేవారు. అవి కేవలం వైఎస్ పథకాలే కాని, కాంగ్రెస్ పథకాలు కాదని క్రెడిట్ తమ కుటుంబ ఖాతాలో వేసుకునేవారు. కాంగ్రెస్ పథకాలే అయితే, ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెట్టలేదో సోనియా బదులివ్వాలని నిలదీశారు. తన తండ్రి పెట్టిన పథకాలకు నిధులు ఇవ్వకపోయినా, రద్దు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం అంతుచూస్తామని జగన్ హెచ్చరించేవారు. ఇలా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ పై ఒంటికాలిపై లేచి జగన్ శివాలెత్తిపోయేవారు. ఫలితంగా అతడిని అక్రమాస్తుల కేసులో జైలుకు పంపించారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కూడా జగన్ చంద్రబాబును నిత్యం టార్గెట్ చేస్తున్నారు. విమర్శిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. నిలదీస్తున్నారు. అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా ఎండగడుతున్నారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతూ ఢీ కొడుతున్నారు. ప్రతిపక్షనేతగా ఘాటైన విమర్శలతో విరుచుకుపడంట తప్పుకాదు. కానీ నంద్యాల ఎన్నికల సహా పలు సందర్భాల్లో ఆ విమర్శలు శృతి మించాయి. బట్టలూడదీసి కొట్టండి. ఫ్యాంట్ విప్పదీసి కొట్టండి వంటి వ్యాఖ్యలు జగన్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. చంద్రబాబు వయసుకు మర్యాద ఇవ్వకపోయినా సీఎం హోదాకైనా ఇవ్వాలి కదా…అని చర్చకు దారి తీశాయి. ఆ ప్రభావం నంద్యాల ఉప ఎన్నికల్లో పడింది. అక్కడ అధికార పార్టీ ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం, ప్రలోభాల పర్వం ప్రధానంగా పని చేసినా, జగన్ వ్యాఖ్యలు కూడా అతడికి నష్టం కలిగించాయి. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధిని ఓటమి పాల్జేశాయి.
ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన సమయం. ఈ కీలక సమయంలో జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని టార్గెట్ చేయాల్సిన టైం. కానీ ఈ అంశాన్ని వినియోగించుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమవుతున్నారు. పాదయాత్రను చంద్రబాబుని తిట్టడానికే కేటాయిస్తున్నారు. నాడు సోనియా, కాంగ్రెస్ మీద చేసిన మాటలదాడిలో పది శాతం కూడా నేడు మోడీ సర్కార్ పై చేయడం లేదు. ప్రత్యేకహోదా కోసం ఆంధ్రులు ఎదురుచూస్తున్నారు. మోడీ మోసం చేశాడని రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీని ఎంత టార్గెట్ చేసి, ఘాటైన విమర్శలు, ఆరోపణలు, ఆందోళనలతో ఇరుకున పెడితే అంత లాభం. కానీ జగన్ ఎందుకో మౌనం వహిస్తున్నారు. పోనీ మేం తిట్టినట్టు నటిస్తాం. మీరు కొట్టినట్టు నటించండి…అని లోపాయికారి ఒప్పందంతో నాలుగు మాటలు అంటున్నారా ? అంటీ లేదు. ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం అత్తారింటిలో కొత్త కోడలు మాదిరిగా మోడీ ప్రభుత్వం చేసిన హోదా మోసంపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ సహా ఆయన పార్టీ నేతలంతా చేయాల్సింది హోదా కోసం తీవ్ర పోరాటం. మొహమాటాల్లేకుండా మోడీని ఎండగట్టడం. అలా చేస్తేనే ఆంధ్రుల గుండెల్లో వీరికి స్థానం. మోడీని టార్గెట్ చేసి మాటల దాడితే ఇరుకున పెడితే, ఆటోమేటిగ్గా చంద్రబాబును సైడ్ చేసేసినట్టే. బాబుకి ఇప్పుడిచ్చినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనే లేదు. కానీ చంద్రబాబు రోజంతా మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తుంటే, జగన్ మాత్రం ఆ విషయంలో సైలెంట్ అయిపోతున్నారు. మొత్తానికి నాడు సోనియా, కాంగ్రెస్ సర్కార్ మీద అధికదాడితో అవస్థల పాలయ్యారు. నేడు మోడీ ప్రభుత్వం వద్ద భయంతో, అతి జాగ్రత్తతో, మౌనంతో జనంలో చులకనవుతున్నారు.
