ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి సంచలన ఆరోపనలు చేశారు. పాదయాత్రలో ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో బాబుపాలనపై నిప్పుడు చెరిగారు.రైతుల రుణ మాఫీతో పాటు, రూ, 20 లక్షల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాని జగన్ నిలదీశారు. ప్రస్తుతం బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మిత్ర పక్షాలయిన భాజాపా, జనసేన పార్టీలే ఇప్పుడు బాబును వ్యతిరేకిస్తున్నాయన్నారు.
గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైఎస్సార్సీపీ కంటే కేవలం 1.5 శాతం మాత్రమే ఎక్కువ వచ్చాయన్నారు. 2014 తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు మరచిపోయారని, ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ప్రకటనను స్వాగతించడమే కాకుండా మళ్లీ యూటర్న్ తీసుకుని హోదా కావాలనడం ఎంత వరకూ సమంజసమని జగన్ నిలదీశారు.
తాను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బాబు నెపం నెడుతున్నారన్నారు. చంద్రబాబు పగలు కాంగ్రెస్తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీతో ఒప్పందంగానీ, పొత్తు గానీ ఉండదని తేల్చిచెప్పారు.
నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల్లో ఎవరు ప్రధాని అవుతారనేది తమకు ముఖ్యం కాదని, వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే వారికే తన మద్దతు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెసు ఇచ్చిన హామీపై ప్రతిస్పందిస్తూ… గతానుభవం దృష్ట్యా తాము ఎవరినీ నమ్మలేమని, వారు అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. బిజెపితో తనకు రహస్య ఒప్పందం ఉందనే విమర్శలపై ప్రశ్నించినప్పుడు అంశాలవారీగా తాము మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హంగ్ అసెంబ్లీ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమకు మెజారిటీ వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. పదేళ్లుగా ప్రజల మధ్య గడుపుతూ వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నాని జగన్ తెలిపారు. పాదయాత్రలో కొన్ని లక్షల మందిని నేరుగా కలుసుకున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే ప్రజలు మెచ్చే పరపాలన చేస్తానని జగన్ పేర్కొన్నారు.
