ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఎన్నికోట్లు ఖర్చవుతాయ్…? ఈ ప్రశ్నను ఏపీ సీఎం చంద్రబాబును గానీ.. తెలుగుదేశం పార్టీ నాయకులెవరిని అడిగినా… ఒక్కడే సమాధానం వస్తోంది.. అక్షరాల లక్షల కోట్ల రూపాయలుంటే గానీ అనుకున్న స్థాయిలో అమరావతి నిర్మాణం జరగదని.. అదే విషయాన్ని టీడీపీ మిత్రపక్షం నాయకుడు సోము వీర్రాజును అడిగితే లక్ష కోట్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. దేశంలో ఇదివరకు ఏర్పడిన జార్ఖాండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా రాజధాని నిర్మాణం కోసం ఇంతలా వెంపర్లాడ లేదన్న సోము… ఏపీ రాజధాని కోసం మాత్రం లక్షల కోట్ల రూపాయలు అడగడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి పచ్చని పైరులనే వదులుకునేందుకు రైతులు ముందుకు రాగా.. ఇంకా ఎందుకు కోట్ల రూపాయలు కావాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం చుట్టూ తిరుగుతోందని ప్రశ్నించారు.
అమరావతి నిర్మాణానికి ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు 20వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని.. ఇంకా రాజధాని రోడ్ల నిర్మాణానికి నితిన్ గడ్కరీ దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు కేటాయించారని ఆయన తెలిపారు. అయినా అభివృద్ధి వికేంద్రణ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభం కానీ.. హైదరాబాద్ లో అన్నీ అమరావతిలో పెట్టేస్తే మళ్లీ వివాదం మొదటికి వస్తుందని గుర్తు చేశారు సోము వీర్రాజు.
