ఏపీ సీఎం చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల విషయంలో చొరువ చూపడంలేదంటూ ఫైర్ అయ్యారు. 2014-15 నుంచి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదళ చేయాలని లేఖ రాసినా బాబు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తాను ఏపార్టీకి చెందిన వాడిని కాదని..ఏ పార్టీ ప్రోత్సాహంతో మాట్లాడలేదన్నారు. అప్పుడప్పుడూ తమ కళాశాలకు భిక్షం మాత్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు కూడా తనకు ఎంతో సన్నిహితుడని చెప్పిన మోహన్ బాబు… ఆయన విధానాలపైనే తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఒకప్పుడు తమ విద్యానికేతన్, కళాశాల గొప్పదని ఆయనే అంటే పొంగిపోయానని అన్నారు. విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఇస్తామని ఆ సందర్భంలో హామీ ఇచ్చినా చంద్రబాబు మాటనిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరారు.
