ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందా? బాబును రక్షించే అవకాశం తమ చేతిలో ఉన్నా కూడా.. కేసీఆర్ ను నియంత్రించుకొని బాబుపై ఎలాంటి చర్యలూ లేకుండా చేసే అవకావం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయడం లేదా?
ఈ విషయంలో తమకేంపట్టనట్టుగా ఉండి బాబును ఇరికించడానికే కేంద్రం నిర్ణయం తీసుకొందా? అంటే.. అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి వీడియో టేపులు, బాబుగారి ఆడియో టేపులు ఢిల్లీకి చేరుకొన్నాయని తెలుస్తోంది. వీటిని పరిశీలించి కేంద్ర హోం శాఖ పూర్తి వివరాలు తీసుకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి సుజానచౌదరికి భాగస్వామ్యం ఉన్న విషయాన్ని కూడా కేంద్రం గుర్తించిందని సమాచారం. ఆడియో టేపుల్లో సుజనా పేరు వినిపిస్తుందని తెలుస్తోంది.
దీంతో అలర్ట్ అయిన కేంద్రం.. సుజనను మాత్రం రక్షించాలనే నిర్ణయం తీసుకొంది. ఒకవేళ తెలంగాణ ఏసీబీ ఈ వ్యవహారంలో సుజనాకు నోటీసులు ఇస్తే.. అప్పుడు మోడీ పరువే పోతుంది. మోడీ మంత్రిగారు ఒకరు ఇలాంటి పనులు చేశారనే విమర్శలు వస్తాయి. అందుకే మోడీ సర్కారు సుజనను రక్షించడానికి నిర్ణయించిందని.. బాబు గారికి కావాలంటే నోటీసులు జారీ చేసుకోండి.. ఏమైనా చేసుకొండి.. కేంద్రమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టే.. సుజనా చౌదరిని నోటీసుల నుంచి మినహాయించండి అంటూ కేంద్రం కేసీఆర్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
