టాలీవుడ్ అగ్రనాయిక సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును దాటి, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. జూన్ 19న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో, చిత్రబృందం సమంతకు సర్ప్రైజ్ ఇస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.
ఈ అద్భుత విజయంపై సమంత స్పందిస్తూ, సినిమా విడుదలకు ముందు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. “సినిమా రిలీజ్కు ముందు నా స్నేహితుడు ఒక ఎగ్జిబిటర్ను వసూళ్ల గురించి అడిగారు. అప్పుడు అతను ‘హీరోయిన్ సినిమాను ఎవరెందుకు చూస్తారు? గ్లామర్ లేని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఆదరణ ఉండదు’ అని నిర్మొహమాటంగా చెప్పారు” అని సమంత వెల్లడించారు. ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, తాము సాధించిన ఈ విజయం మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకు బాటలు వేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
సమంత ఖాతాలో చేరిన ఈ భారీ విజయంపై కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, లక్ష్మీ మంచు తదితర సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలనే సమంత సందేశానికి చిత్ర పరిశ్రమ నుంచి మంచి మద్దతు లభిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 17 నుండి ‘జియో హాట్స్టార్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. “ఒక్కొక్కడిని కొడతాం చూడు ప్రేమతో అబ్బా” అంటూ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్తో ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడని వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.
