టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెంకటేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ (AK47) పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. గతంలో వెంకీ కెరీర్‌లో ఐకానిక్ హిట్స్‌గా నిలిచిన ‘నువ్వు నాకు నచ్చావ్’.. ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ కేవలం డైలాగ్ రైటర్‌గా మాత్రమే పనిచేశారు. అయితే ఈ రెండు క్లాసిక్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో నేరుగా వస్తున్న మొదటి పూర్తి స్థాయి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ నుండి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ (Save the Tigers) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దేవ్యాని శర్మ.. ఈ భారీ స్టార్ స్టడెడ్ డ్రామాలో ఒక కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా జాయిన్ అయినట్లు సమాచారం. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం దేవ్యాని శర్మ కెరీర్‌కు పెద్ద మైల్‌స్టోన్ అనే చెప్పాలి.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్.. పూజిత పొన్నాడ.. రావు రమేష్.. బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్‌తో పాటు మరిన్ని అధికారిక అప్‌డేట్స్‌ను ప్రకటించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
