వైఎస్ రాజశేఖర్ రెడ్డి..ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. పాదయాత్రతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు వైఎస్. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూసిన వైఎస్…ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్ సైతం పాదయాత్రతోనే ప్రజలకు దగ్గరయ్యారు.
ఇక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన యాత్ర సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. మహి వి రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం జగన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పడిందనే చెప్పాలి. తాజాగా ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు జగన్ కోసం మళ్లీ యాత్ర 2ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు రాఘవన్.
ఏపీలో వచ్చే ఎన్నికలకు ఈ సినిమా కర్టెన్ రైజర్‌గా ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మమ్ముట్టి ఈ సినిమాకు సంబంధించి తన పాత్రను పూర్తిచేశారు. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రను సూర్య పోషించనున్నట్లు తెలుస్తోంది. V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ కలిసి ఈ పొలిటికల్ డ్రామాని నిర్మిస్తున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ సైతం జగన్‌కు మద్దతుగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏదిఏమైనా రెండోసారి అధికారంలోకి రావడానికి తనకు కలిసివచ్చే ఏ అంశాన్ని వదిలిపెట్టకూడదని భావిస్తున్నారు జగన్.
