మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక అదునుగా భావించి దొంగలు సైతం తమ చేతి వాటం ప్రదర్శించారు. కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వెళ్తున్న ఓ మహిళ మెడలో ఉన్న సుమారు 5 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
దొంగతనం జరిగిన విషయం గమనించిన బాధితురాలు వెంటనే ఆలయ నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలను ట్రాక్ చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఆలయాల్లో అప్రమత్తంగా ఉండాలని, విలువైన ఆభరణాలు ధరించి రాకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది.
