- Advertisement -

న్యాయవాది హత్య కేసులో సంచలన మలుపు.. కాంగ్రెస్ నేత అరెస్ట్!

- Advertisement -

హైదరాబాద్‌లో కలకలం రేపిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు అత్యంత షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ మర్డర్ మిస్టరీలో పక్కా ప్లాన్ ప్రకారం సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. ఈ కేసులో కీలక నిందితులైన కాంగ్రెస్ నాయకుడు ముజహీద్ ఆలం ఖాన్‌తో పాటు అతని కుమారుడు మహబూబ్ ఆలం ఖాన్‌లను పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. అలం ఖాన్.. అతని కుమారుడు కలిసి న్యాయవాది మొయినుద్దీన్‌ను హతమార్చడానికి ఏకంగా రూ. 25 లక్షల భారీ సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. గత రెండేళ్లుగా మొయినుద్దీన్‌ను మట్టుబెట్టేందుకు ఈ తండ్రీకొడుకులు తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో వివిధ పద్ధతుల్లో సుమారు పదిసార్లు ఆయనను హత్య చేసేందుకు విఫలయత్నాలు చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించడం గమనార్హం.

చివరకు కవాడిగూడ ప్రాంతానికి చెందిన వినయ్ అనే వ్యక్తికి రూ. 10 లక్షల సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఇందుకోసం అత్యంత పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఆరు నెలల క్రితమే ఎవరికీ అనుమానం రాకుండా ఒక సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కిరాయి ముఠాను రంగంలోకి దించి న్యాయవాది కదలికలపై నిరంతరం రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం శనివారం ఉదయం న్యాయవాది మొయినుద్దీన్ తన ఇంటి నుండి బయటికి రాగానే.. వినయ్ తన వద్ద ఉన్న కారుతో ఆయనను బలంగా ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరిస్తూ హతమార్చాడు.

హత్య అనంతరం పరారైన ప్రధాన నిందితుడు వినయ్‌ను పోలీసులు చాకచక్యంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా ముఠా సభ్యులు గోవాకు పారిపోవడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయవాది కొడుకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ నాయకుడు ముజహీద్ ఆలం ఖాన్.. మహబూబ్ ఆలం ఖాన్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొదట బెంగళూరు నుంచి వారిని రప్పించి విచారించారు. విచారణలో నేరం రుజువు కావడంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -