కోదాడలో పోలీసుల దాడిలో లాకప్ డెత్‌కు గురై వంద రోజుల క్రితం మరణించిన కర్ల రాజేష్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా ఈరోజు రాజేష్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రాజేష్‌ను సమాధి చేసిన ప్రాంతానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులతో కలిసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. పోలీసులు, ఎమ్స్ వైద్యులు పంచనామా ప్రక్రియ పూర్తి చేసి రీ–పోస్టుమార్టానికి సిద్ధమయ్యారు.
రాజేష్‌ను పోలీసులు చట్టవిరుద్ధంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఎమ్మార్పీఎస్ ఆరోపిస్తోంది. దీనికి బాధ్యులైన ప్రతి పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. వంద రోజులుగా నిర్విరామంగా న్యాయపోరాటం సాగించిన ఎమ్మార్పీఎస్ ఒత్తిడితోనే ఈ దశకు కేసు వచ్చిందని నాయకులు పేర్కొన్నారు.
ఇప్పటికే సిఐ, ఎస్సైపై కస్టోడియల్ డెత్, చిత్రహింసలు, అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. సిఐను సస్పెండ్ చేయగా, ఎస్సైను ఎస్పీకి అటాచ్ చేశారు. రాజేష్ తల్లికి ఉద్యోగం, పింఛన్, రేషన్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు మూడు ఎకరాల భూమి ప్రొసీడింగ్స్ సిద్ధం చేశారు. ఇక ఎస్సై సస్పెన్షన్, పోస్టుమార్టం నివేదికలో మార్పులు చేసిన వైద్యులు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలే మిగిలి ఉన్నాయని ఎమ్మార్పీఎస్ స్పష్టం చేసింది.
