ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి, చివరకు యువతిని హత్య చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఖాజీపేట మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న కీర్తనను, వెంకటేష్ అనే యువకుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో, ఇంటికే వెళ్లి గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడు.
పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి, చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మైదుకూరు నుంచి తరలిస్తుండగా, Basapuram check post వద్ద నిందితుడు పారిపోవడానికి యత్నించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడగా, పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు సీఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం అయింది.
గాయపడిన నిందితుడిని వెంటనే కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
