బీహార్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహర్సా జిల్లాలో విద్యార్థులకు వడ్డించిన భోజనంలో పాము పిల్ల కనిపించడం, అది తిన్న వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం స్థానికంగా పెను కలకలం సృష్టించింది.
సహర్సా జిల్లా బాలువాహ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయం కావడంతో విద్యార్థులందరికీ ఆహారాన్ని వడ్డించారు. చిన్నారులు భోజనం చేస్తున్న క్రమంలో, ఒక విద్యార్థి ప్లేటులో పాము పిల్ల ప్రత్యక్షమైంది. ఇది గమనించే లోపే అప్పటికే చాలా మంది విద్యార్థులు ఆ ఆహారాన్ని తినేశారు.
ఆహారం తిన్న కాసేపటికే విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం, కడుపునొప్పి అని విలవిలలాడటం ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. సుమారు వందలాది మంది విద్యార్థులను అంబులెన్స్‌లు మరియు ప్రైవేట్ వాహనాల్లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు విద్యార్థులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొందరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం మరియు వంట సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని వారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆగ్రహించిన గ్రామస్థులు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు.
ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. భోజనం తయారు చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు.
