రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర సంఘటన స్థానికులను కలచివేస్తోంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఒక చిన్నారి, సుమారు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలో హృదయవిదారక సంఘటన వెలుగుచూసింది. వీధి కుక్కల దాడికి గురైన ఆదిత్య అనే బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. తంగళ్లపల్లికి చెందిన మహేష్ – సంగీత దంపతుల కుమారుడు ఆదిత్య, 15 రోజుల క్రితం తన ఇంటి ముందు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఆదిత్య ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు అతనిపై విరుచుకుపడ్డాయి. ఒక కుక్క బాలుడి కాలుపై బలంగా కరిచింది. ఆ కుక్కల దాడి నుండి తప్పించుకోవడానికి ఆదిత్య భయంతో పరుగు తీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బాలుడి తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు.
కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గత 15 రోజులుగా ఆదిత్య అక్కడ మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు. బాలుడి ప్రాణాలను కాపాడడం కోసం తల్లిదండ్రులు సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు చేసి మరి ఖర్చు చేశారు. అయినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆదిత్య బుధవారం కన్నుమూశాడు.
