పాతబస్తీలో “గోల్డ్ మ్యాన్”గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అసలు నిజం బయటపడింది. భారీ బంగారు ఆభరణాలతో ప్రజల్లో గుర్తింపు పొందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్‌పై ఆదాయపు పన్ను శాఖ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సూర్యాభాయ్ ధరించే ఆభరణాలు అసలు బంగారం కావు. అవి రాగితో తయారు చేసి, రోడియం పూత వేసినవని తేలింది. మొత్తం ఆభరణాల విలువ కేవలం రూ.3 లక్షల వరకు మాత్రమే ఉందని అధికారులు గుర్తించారు.ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూతతో తయారు చేసినదిగా బయటపడింది.
ధనవంతుడిగా కనిపించేందుకు సూర్యాభాయ్ సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలను ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. బంగారం ధరించి తిరుగుతున్నట్టు కనిపించినప్పటికీ, అసలు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సొంత ఇల్లు లేదు,నెలకు రూ.20,000 కిరాయికి అద్దె ఇంట్లో నివాసం.గత ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు.2022–23 సంవత్సరానికి కేవలం రూ.4.9 లక్షల ఆదాయం మాత్రమే చూపించారు.
ప్రజల్లో గుర్తింపు పొందడం, సినిమా అవకాశాలు పొందడమే లక్ష్యంగా ‘గోల్డ్ మ్యాన్’గా ప్రచారం చేసుకున్నానని సూర్యాభాయ్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.బంగారంతో మెరిసిపోతున్న వ్యక్తి వెనుక ఉన్న నిజం బయటపడటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
