ఖమ్మం పట్టణంలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య తన అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన కలకలం రేపింది. ఖమ్మం గాంధీ నగర్‌కు చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ మద్యం తాగడం అలవాటుగా మారింది. దీంతో ఆరోగ్యం క్షీణించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రవి త్వరలో చనిపోతాడని భావించిన భార్య ప్రశాంతి జూలై నెలలో అతని పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో ప్రశాంతి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 2వ తేదీన రవికి మద్యం తాగించి బయటకు తీసుకెళ్లింది. అనంతరం రవి బావమరిది అయిన శ్రీనివాస్ సహాయంతో కారుతో ఢీకొట్టించి ప్రమాదం జరిగినట్లుగా చూపించి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.మొదట ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా కనిపించినప్పటికీ, ప్రశాంతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. విచారణలో ఆమె ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందే కుట్ర పన్నినట్లు బయటపడింది.
ఈ కేసులో ప్రశాంతి, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
