రూపాయల కోసం కన్నవారిని కట్టుకున్నవారిని చంపేస్తున్న రోజులివి. అలాంటిది కేవలం ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులపై ఆశతో ప్రాణ స్నేహితుడిని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చిన భయంకరమైన ఉదంతం నారాయణపేట జిల్లాలో వెలుగుచూసింది. మద్యం తాగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా చంపేసిన ముగ్గురు స్నేహితులను మక్తల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ మర్డర్ మిస్టరీ వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ పరిధిలో ఈ ఘోర హత్య చోటుచేసుకుంది. మృతుడి పేరిట ఉన్న రూ. 50 లక్షల భారీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అతని స్నేహితులు పథకం వేశారు. ఈ క్రమంలోనే పక్కా స్కెచ్‌తో సదరు స్నేహితుడికి విపరీతంగా మద్యం తాగించారు. అనంతరం ఎవరూ లేని ఒక నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకెళ్లి కర్రలు రాళ్లతో తలపై బలంగా బాది కిరాతకంగా హతమార్చారు. అనంతరం ఈ ఘోరాన్ని పక్కా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారు.
హత్య అనంతరం ఏమీ తెలియనట్లు నటిస్తూ.. అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులను నమ్మించేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో మృతుడి కాల్ డేటా ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు ఆడిన రోడ్డు ప్రమాదం నాటకం పూర్తిగా బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యకు ఉపయోగించిన కారుతో పాటు రాళ్లు, కట్టెలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
