దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. సినిమా విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో చిత్రబృందానికి భారీ ఊరట లభించింది. ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాల్సిందిగా కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సెన్సార్ బోర్డు)కి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
సెన్సార్ ప్రక్రియలో అనవసర జాప్యం జరుగుతోందని చిత్ర నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు, చట్టపరమైన నిబంధనల ప్రకారం సినిమాను పరిశీలించి తగిన సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉందని వ్యాఖ్యానించింది. సినిమా విడుదలపై అనిశ్చితి కొనసాగడం వల్ల నిర్మాతలకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు ఉత్తర్వులతో ఇప్పుడు ‘జన నాయగన్’ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగినట్టయ్యింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు జనవరి 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఉంది. విజయ్ అభిమానులు ఈ నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నేపథ్యం, సామాజిక అంశాలతో కూడిన కథాంశంతో తెరకెక్కిన ‘జన నాయగన్’ విజయ్ కెరీర్‌లో మరో కీలక చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
