మాజీ మంత్రి అంబటి రాంబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ పూర్తి ఊరట లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మరో కేసులో కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడంతో ఆయన విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారం ఈ కొత్త మలుపుకు కారణమైంది. అప్పట్లో పెన్షన్ లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరికి రూ.200 చొప్పున మినహాయించి లక్కీ డ్రా టికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఈ కేసులో అంబటిపై పీటీ వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, అంబటి రాంబాబును తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో ఎక్సైజ్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే కస్టడీ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. సీఎం చంద్రబాబును దూషించిన కేసులోనూ ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుంచి విడుదల కావాల్సిన సమయంలో కొత్త పీటీ వారెంట్ జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
