ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త పల్లవి అందుకున్నారు. గోదావరి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన పవన్.. పారిశ్రామిక వ్యర్థాల వల్ల నది జీవకళ కోల్పోతోందని ఆవేదన చెందారు.
అదే సమయంలో మా తెలుగు తల్లి గేయం లిరిక్స్ మార్చాలని…మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయంలో గోదావరి కృష్ణమ్మల గలగలలు అని పాడుకోవడం కేవలం గతమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి కృష్ణమ్మలు వెలవెల పోతున్నాయని పాడుకోవాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. నదుల సంరక్షణను విస్మరిస్తే భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం చేసినట్లవుతుందని హెచ్చరించారు.పవిత్రమైన నదులను మురికికూపాలుగా మారుస్తున్న పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
ఆంధ్రా పేపర్ మిల్ నుంచి గోదావరిలో కలుషిత నీరు చేరుతోందని.. కలుషిత నీరు కలిసే చోటుకు వెళ్లిన పవన్..ఆ నీటిని శాంపిల్స్ టెస్టుకు పంపించారు. నదులను కలుషితం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక జారీ చేశారు. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలు ఎంతటివారైనా సరే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు సైతం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
