కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమల–తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ప్రతిష్ట దిగజారే చర్యలు జరుగుతున్నాయని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపజేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు, వాస్తవంగా ఆలయాల భద్రతను గాలికి వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాజాగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన మహాపచారం దీనికి నిదర్శనమని భూమన పేర్కొన్నారు. ఆలయ రాజగోపురంపైకి మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎక్కి హంగామా సృష్టించడం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. “90ML ఇస్తేనే గానీ కిందకు దిగను” అంటూ అతడు చేసిన రచ్చ ఆలయ గౌరవాన్ని దిగజార్చిందని విమర్శించారు. పరిస్థితిని అదుపు చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో, ఆలయంపై ఉన్న కలశాన్ని పెకిలించే ప్రయత్నం జరగడం మరింత ఆందోళనకరమని చెప్పారు.
ఇదే కాకుండా కొండపై కూడా వరుసగా అపచారాలు జరుగుతున్నాయని, అయినా టీటీడీ విజిలెన్స్, భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా లేకపోవడం బాధాకరమని భూమన అన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చేవరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. మీడియా ముందు రంకెలేయడం కాదు, ఇలాంటి ఘటనలకు బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“టెంపుల్ సిటీని లిక్కర్ సిటీగా మార్చిన పాపం ఎవరిది?” అని భూమన నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల భద్రత కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని, వెంటనే సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
