తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, సాంకేతికతను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు కోసం కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
ఈ చారిత్రక ఒప్పందంతో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ త్వరలో ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు యూనివర్సిటీ సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడానికి మరియు మొత్తం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం సంపూర్ణంగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఉన్నత విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ ఎంవోయూ ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
