ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, చాలామందికి తమ శాఖల్లో ఏమి జరుగుతుందో పూర్తిగా అవగాహన లేకుండా ఉందని ఆయన తీవ్రమైన ఆక్షేపణలు చేశారు.
ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కీలక నిధులను సద్వినియోగం చేసుకుంటున్న సందర్భంలో, మన మంత్రులు కేంద్ర నిధులు తీసుకురావడంలోనూ, వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడంలోనూ విఫలమవుతున్నారని సీఎం స్పష్టం చేశారు. కేంద్రాన్ని తరచుగా ఫాలోఅప్ చేయడం, అవసరమైతే ఢిల్లీకి వెళ్లడం కూడా ఒక మంత్రి బాధ్యతేనని, ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.
మంత్రులు తమ శాఖల సమస్యలను లోతుగా పరిశీలించి, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలతో, అధికారులు తో సమన్వయం పెంచుకుని ఫీల్డ్లోకి వెళ్లి పరిస్థితేంటి అనేది తెలుసుకోవాలని సూచించారు. ఇకనైనా మంత్రులు తమ పనితీరులో మార్పులు చేసుకుని, ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పనిచేయాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
చివరిగా, “పనితీరులో మార్పు తప్పనిసరి. ప్రజల కోసం పనిచేయడం మన ప్రధాన కర్తవ్యం” అని సీఎం చంద్రబాబు మంత్రులను గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.
