విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ శివారు రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పమానువలస, పల్లపుదుంగాడ గ్రామాలకు చెందిన గిరిజన విద్యార్థులు రహదారి కోసం వినూత్న నిరసన చేపట్టారు. రెండేళ్లుగా రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిరోజూ సుమారు 4 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కొండ ప్రాంతం కావడంతో మొత్తం ప్రయాణం దాదాపు 12 కిలోమీటర్ల వరకు అవుతుందని వారు చెబుతున్నారు. వర్షాకాలంలో గుంతలు, బురదతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. సరైన రహదారి లేకపోవడంతో కొన్ని రోజులుగా బడులకు వెళ్లడం కూడా మానేస్తున్నామని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు నిర్మాణం కోసం పిల్లలు గుంతల రోడ్డులో నిలబడి మెడలో పవన్ కళ్యాణ్ ఫోటో ధరించి “డిప్యూటీ సీఎం సార్, మా పల్లెకు రోడ్డు వేయండి” అంటూ విజ్ఞప్తి చేశారు. “మాకు రోడ్డు వేయండి… మేము చదువుకుంటాం” అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
తమ పిల్లల భవిష్యత్తు కోసం వెంటనే రహదారి నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రోడ్డు లేకపోవడం వల్ల అత్యవసర సేవలు కూడా అందడం కష్టమవుతోందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
