తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండగా రాత్రిపూట మాత్రం విపరీతమై చలి వణుకు పుట్టిస్తోంది. పట్టణప్రాంతాల్లోనే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరగా ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి చెప్పనవసరం లేదు.
ముఖ్యంగా అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయి. పాడేరు ఏజెన్సీలో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇళ్లలోనుండి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో ఏపీతో పాటు ఒడిశా సరిహద్దులో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.
తెలంగాణలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే ఇవాళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ప్రజలు జాగ్రత్త వహించాలని లేకుంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
