అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న 10% సుంకాన్ని 15%కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలో అమెరికాను గతంలో ఎన్నో దేశాలు దోచుకున్నాయి… ఇకపై అలాంటిదేం ఉండదు అంటూ సుంకాలను తక్షణమే 15%కు పెంచుతున్నట్లు తెలిపారు.
అమెరికా సుప్రీం కోర్టు.. 1977 ఐఈఈపీఏ చట్టం కింద ట్రంప్ విధించిన విస్తృత సుంకాలు అధ్యక్ష అధికారాన్ని మించి ఉన్నాయని పేర్కొంది. దీంతో ట్రంప్ 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122 ఆధారంగా 10% సుంకం విధించారు. ఇప్పుడు దానిని 15%కు పెంచారు. ఈ తాత్కాలిక చర్య 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది.
వైట్ హౌస్ ప్రకటన ప్రకారం భారత్‌కు కూడా కొత్త 15% సుంకం వర్తిస్తుంది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14257 కింద వస్త్రాలు, రసాయనాలు, యంత్రాలపై ఉన్న సుంకాలపై ఇది అదనంగా ఉంటుంది. ఫార్మాస్యూటికల్స్, రత్నాలు వంటి కొన్నివస్తువులకు మినహాయింపులు ఉండొచ్చు.
ట్రంప్ “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” లక్ష్యంతో మరిన్ని చట్టబద్ధ సుంకాలు ప్రకటిస్తానని తెలిపారు. అయితే విమర్శకులు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది.
