విశాఖపట్నంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా పార్టీకి వెళ్లిన ఓ యువతి శవమై తిరిగిరావడం నగరంలో కలకలం సృష్టించింది. ఒక హోటల్ గదిలో జరిగిన ఈ హత్యోదంతం పక్కా స్కెచ్‌తో జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సరదాగా పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచిన స్నేహితులే, ఆ యువతి పాలిట మృత్యువులా మారారు. విశాఖపట్నంలోని ప్రసిద్ధ ‘బి స్క్వేర్’ (B Square) హోటల్‌లో జరిగిన ఈ దారుణ హత్య వివరాలు ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. శాంతి కుమారి అనే యువతి మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్తానని చెప్పి హోటల్ ‘బి స్క్వేర్’కు వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో, ఏదో విషయంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ గొడవ ముదిరిపోవడంతో, స్నేహితులు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు.
హత్య చేసిన తర్వాత నిందితులు సినిమా ఫక్కీలో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. శాంతి కుమారికి అకస్మాత్తుగా ‘ఫిట్స్’ వచ్చాయని, అందుకే ఆమె స్పృహ కోల్పోయిందని పోలీసులకు సమాచారం ఇచ్చి నమ్మించే డ్రామా ఆడారు. కానీ, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హోటల్ గదిని పరిశీలించి, ఆమె మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అది ఫిట్స్ కాదని, పక్కాగా జరిగిన హత్య అని నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను గుర్తించారు. వీరిలో నలుగురు యువకులు కాగా, ఒక యువతి కూడా ఉంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.హోటల్ గదిలో మద్యం మత్తులో గొడవ జరిగిందా? లేక మరేదైనా పాత కక్షలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయానికే తమ బిడ్డ శవమై కనిపించడంతో శాంతి కుమారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నమ్మిన స్నేహితులే ఇలా ప్రాణాలు తీస్తారని ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
