ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి కొడాలి నాని.. వైసీపీ నేత జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు అర్థమైందని కొడాలి నాని అన్నారు. ఆయనను వదులుకున్నామని నిరుపేద ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా అవ్వకుండా అడ్డుకునే శక్తి ఈ కూటమికి లేదని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో పేదల ఇంటికే డబ్బులు పంపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించాయని తెలిపారు.2024లో జగన్‌ను ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలు కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయితే జగన్ చేసిన మంచి పనుల వల్ల వైసీపీ కార్యకర్తలు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని అన్నారు.
జగన్ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ, తన సొంత ఆస్తిలో కూడా చెల్లెలికి వాటాలు ఇచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నా, జగన్ మాత్రం సంస్కారంతో ఎక్కడా చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదని అన్నారు.
తిరుపతి లడ్డూ వ్యవహారంపై కూడా స్పందించిన కొడాలి నాని, ఈ విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాడని వ్యాఖ్యానించారు. కొడాలి నాని వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం ముదిరింది.
