హైదరాబాద్ పారిశ్రామిక భూముల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన HILT స్కాంపై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. మొత్తం 9,300 ఎకరాల ప్రజల ఆస్తిని పారిశ్రామికవేత్తలకు అన్యాయంగా కట్టబెట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ పూర్తిగా అక్రమమని, ఇప్పుడే భూములు కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. “రేవంత్ రెడ్డి ఇచ్చే ఆషాడం ఆఫర్లో భూములు కొంటే, మేము వచ్చే మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలసీని రద్దు చేస్తాము” అంటూ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
స్కాం కు సంబంధించిన జీవో లీక్ అయినందుకు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, కానీ ఈ దోపిడీని చూసి ఓ నిజాయితీ గల తెలంగాణ బిడ్డ బయట పెట్టిన విషయమై తప్పు లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “రేవంత్ రెడ్డి, అతని సోదరులు గత ఆరు నెలలుగా ఈ భూములపై అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు” అని ఆయన ఆరోపించారు.
ఈ భారీ భూ కుంభకోణాన్ని అడ్డుకునేందుకు అన్నినియోజకవర్గాల్లో ప్రజలను కూడగట్టి, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.పర్యటనలో భాగంగా కేటీఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులతో మాట్లాడి వారి బాధలను విన్నారు. ఒక కార్మికుడు ప్రధాని మోడీ నిర్ణయించిన రోజుకు రూ.174 కనీస వేతనంను విమర్శిస్తూ, “ఇంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించగలం?” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
కుత్బుల్లాపూర్ షాపూర్ ప్రాంతంలో హమాలీలతో కేటీఆర్ మాట్లాడి భూముల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.
