పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పేర్ని నాని. పరిస్థితిని పోలీసులు అవసరానికి మించి ఉద్రిక్తంగా మార్చారని ఆయన ఆరోపించారు. తాను ఎవర్నీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని బాడీ షేమింగ్ చేయలేదని స్పష్టం చేసిన ఆయన, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. నేను ఎవర్నీ పేరు పెట్టి అవమానించలేదు. ఒక తప్పు జరిగిన సందర్భంలో స్పందించాను అంతే అని తెలిపారు.
ఈ సందర్భంగా ఒక సీఐ ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తిన పేర్ని నాని….మమ్మల్ని ఏకవచనంతో దూషించడం సరైన విధానమా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు అధికారులు మర్యాద పాటించాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తుచేశారు.
ఒక అధికారి తప్పు చేస్తే, అతన్ని నిలదీస్తే… అందరినీ అన్నట్టుగా ఎలా భావిస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రతి అధికారిని ఒకే తీరుగా చూడకూడదని, మంచి అధికారులు కూడా ఉన్నారని ఆయన అన్నారు.
ఈ క్రమంలో అందరూ జైపాల్ లాంటి అధికారులే ఉండరు కదా? అని వ్యాఖ్యానిస్తూ, కొంతమంది అధికారుల ప్రవర్తన వల్ల మొత్తం వ్యవస్థపై చెడు ముద్ర పడుతుందని పేర్కొన్నారు. మొత్తంగా, పరిస్థితిని చల్లబరచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించడం అవసరమని పేర్ని నాని సూచించారు.
