భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 22) చరిత్ర సృష్టించారు. భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన నేతగా నిలిచారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు.
చామ్లింగ్ 8,930 రోజుల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. ప్రస్తుతం మోదీ మొత్తం 8,931 రోజులు పూర్తి చేసి ఆ రికార్డును దాటారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మరియు భారత ప్రధానమంత్రిగా ఆయన ఈ రికార్డు నెలకొల్పారు.
నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలోని వడ్నగర్‌లో సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తన తండ్రితో కలిసి రైల్వే స్టేషన్ వద్ద టీ అమ్మిన ఆయన, తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా ప్రజాసేవలోకి ప్రవేశించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ లో చేరి క్రమంగా ఎదిగారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దశాబ్దానికి పైగా సేవలందించారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
గుజరాత్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు విజయం సాధించి మోదీ తన నాయకత్వాన్ని మరోసారి నిరూపించారు. భారత ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలిక ప్రజాభిమానాన్ని పొందిన నాయకుడిగా నిలిచారు.
2025 జూలైలో మోదీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, వరుస కాలంలో రెండో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచారు. ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు పదవిలో ఉన్నారు. మోదీ 4,078 రోజులు పూర్తి చేసి ఆమె రికార్డును అధిగమించారు. అయితే, అత్యధిక కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు మాత్రం ఇంకా జవహర్‌లాల్ నెహ్రూ పేరిటే ఉంది.
