బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తమ నేత తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త దశకు సంకేతంగా భావిస్తున్నారు.
ఈ పరిణామం, ప్రధాని మోదీ తారిఖ్ రెహమాన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు బహిరంగంగా వెల్లడించిన మరుసటి రోజే వెలుగులోకి వచ్చింది. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా మోదీ స్పందిస్తూ..తారిఖ్ రెహమాన్‌తో మాట్లాడడం ఆనందంగా ఉంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆయన సాధించిన గణనీయ విజయానికి అభినందనలు తెలియజేశాను అని పేర్కొన్నారు.
అలాగే బంగ్లాదేశ్ ప్రజల ఆశయాలను నెరవేర్చే క్రమంలో నా శుభాకాంక్షలు, మద్దతు తెలియజేశాను అని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ శాంతి, అభివృద్ధి, సుసంపన్నత కోసం భారత్ తన కట్టుబాటును పునరుద్ఘాటించింది అని మోదీ పేర్కొన్నారు.
సూచనల ప్రకారం, ప్రమాణస్వీకార వేడుకకు ప్రాంతీయ దేశాల ముఖ్య నేతలను ఆహ్వానించేలా బీఎన్పీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో ప్రధాని మోదీ కీలక అతిథిగా ఉండే అవకాశం ఉందని సమాచారం.అయితే, ప్రమాణస్వీకార తేదీపై లేదా విదేశీ నేతల హాజరుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
